మనుషుల నుండి మనుషులకు వేగంగా వ్యాప్తిచెందే కరోనా వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని నెహ్రూ యువకేంద్ర డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ ఆకుల మహేందర్రెడ్డి పేర్కొన్నారు. పినాకిని  యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం బాలాజీనగర్లోని ఎస్ వి ఆర్ అక్షరదీప్ స్కూలునందు కరోనా వ్యాధిపై అవగాహనా సదస్సు నిర్వహించి విద్యార్థినీ విద్యార్థులకు మాస్కులను  అందజేశారు. ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ..  కరోనా వైరస్ ను ముందుగా 1960వ సంవత్సరంలో కనుగొన్నారు. ఈ వైరస్ ను మైక్రోస్కోప్ లో పరీక్షించగా కిరీటం ఆకారంలో ఉండడం వలన దీనికి కరోనా అని నామకరణం చేశారు. గతంలో ఈ వైరస్ ఆరు రకాలుగా ఉండేది. ఈ వైరస్  పక్షులు, క్షీరదాల ద్వారా వ్యాప్తి చెందుతుందని తెలియజేశారు. కరస్పాండెంట్ అందె శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఈ వ్యాధి మొదట చైనా దేశంలోని ఉహాన్ అనే ప్రాంతంలో బయటపడింది. ఈ వైరస్ గబ్బిలాలలో ఉన్న కరోనా వైరస్, పాములలో ఉన్న వైరస్ తో కలవడంవలన ఈ 7వ రకం కరోనా వైరస్ ఉద్భవించిందని వివరించారు. అనంతరం విద్యార్థులకు  మాస్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. మురళీమోహన్ రాజు, గౌరవాధ్యక్షుడు టి. వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయురాలు శ్వేత తదితరులు పాల్గొన్నారు.