కండలేరు జలాశయం పునరావాస కేంద్రంలో జరిగిన పనులను పరిశీలించి అనంతరం విలేకరులతో బిజెపి నేత మిడతల రమేష్‌ మాట్లాడారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన జరుగుతుందని, పోలీసులు ద్విజాతి సిద్దాంతాలను అనుసరిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రతిపక్ష నేతను విశాఖ నగరంలోకి అడుగుపెట్టనీయకుండా వైసిపి శ్రేణులు దాడులు చేయడాన్ని ఖండించారు. కాన్వయ్‌ పై దాడిచేసినా, నిర్భందించినా, పోలీసుజీపులెక్కి పెట్రోలుతో తగులబెట్టుకుంటామని బెదిరించిన వారికి పోలీసులు వత్తాసు పలికారు. దాడులు చేసిన వారిపై ఎటువంటి కేసులు నమోదు చెయ్యలేదు. అమరావతి మాత్రం మహిళలు రైతులు 
శాంతియుత నిరసనలు తెలిపిన వారందరిపై పోలీసులు కేసులు బనాయించారు. విశాఖలో దౌర్జన్యం పై కేసులు పెట్టలేని పోలీసులకు అమరావతి రైతులపై కేసులు పెట్టే నైతికహక్కు లేదు. అమరావతిలో మహిళలపై రైతులపై బనాయించిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. చాటగుట్ల పునరావాస కేంద్రంలో రెవెన్యూ అధికారుల తొందరపాటు చర్యల వలన పునరావాస కేంద్రంపై కోర్టులో కేసు దాఖలు వేశారు. జలాశయం కోసం సర్వం కోల్పోయిన రేగడపల్లి, రత్నాపురం, గాచూరు ప్రజలకు మెుదటి ప్రాధాన్యతగా పునరావాస కేంద్రంలో గృహాలు కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతగింజల సుబ్రహ్మణ్యం, గుడవర్తి 
నారాయణనాయుడు, ఓజిలి సుధాకర్‌, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.