నెల్లూరు, జనవరి 29, (రవికిరణాలు) : ఎస్సి, ఎస్టి, బలహీన వర్గాల వారికి సంబంధించిన అట్రాసిటీ కేసులను వేగవంతంగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందేలా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు ఎం.వి.శేషగిరి బాబు అధికారులను ఆదేశించారు.బుధవారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలోని డి.ఆర్.డి.ఎ సమావేశ మందిరంలో ఎస్సి, ఎస్టి వర్గాలకు సంబంధించిన అట్రాసిటీ కేసులపై జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశాన్ని వారు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ఎస్సి., ఎస్టి లపై అపరిష్కృతంగా వున్న అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించి వారికి న్యాయం జరిగేలా
చూడాలన్నారు. ఈ కేసుల గురించి ప్రజలలో అవగాహన కలిగించాలన్నారు. ఇందుకుగాను ప్రతి మూడు నెలలకొకసారి ఈ సమావేశం నిర్వహించాలన్నారు. భూవివాదానికి సంబంధించిన కేసులు ఎక్కువగా వున్నాయని, సదరు కేసులలో ఏవైనా వివరాలు అవసరమైతే రెవెన్యూ అధికారుల వద్ద నుండి పొందవచ్చని వారన్నారు. పెండింగ్ అట్రాసిటి కేసుల నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్, డి.ఎస్.పి. ప్రత్యేకశ్రద్ధ తీసుకొని కేసుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. బాధితులకు సకాలంలో నష్ట పరిహారం అందేలా చూడాలన్నారు. అట్రాసిటి కమిటీ సభ్యులు కేసుల వివరాల గురించి అధికారులను కలసినప్పుడు వారు వేచి వుండకుండా వారు కోరిన వివరాలు వీలైనంత త్వరగా అందజేయాలన్నారు. కుల ధృవీకరణ పత్రాల గురించి వారు మాట్లాడుతూ సాంకేతిక సమస్యలు వున్న వాటిని మినహాయించి ఏ ఏ డివిజన్ లో పెండింగులో వున్న కుల ధృవీకరణ పత్రాలన్ని ఫిబ్రవరి 15 లోపు జారీ చేయవలసిందిగా అధి కారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి భాస్కర భూషణ్ మాట్లాడుతూ ఎస్సి., ఎస్టి అట్రాసిటీ కేసుల విషయంలో వెంటనే స్పందించడం జరుగుతుందని, నేరస్తులను అరెస్టు చేయడం, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నామన్నారు. పెండింగులో వున్న కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి తగు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సమావేశంలో 2వ సంయుక్త కలెక్టరు కె.ఎం.కమలకుమారి, డి.ఆర్.ఓ. జి.మల్లిఖార్జున, సాంఘిక సంక్షేమశాఖ డి.డి. జీవపుత్ర కుమార్, నెల్లూరు, కావలి, గూడూరు ఆర్.డి.ఓ.లు హుస్సేన్
సాహెబ్, సరోజిని, ఉమాదేవి, డి.ఎం.అండ్. హెచ్.ఓ. డా.రాజ్యలక్ష్మి, డి.ఇ.ఓ. జనార్థానాచార్యులు, ఎస్సి, ఎస్టి అట్రాసిటి కమిటీ సభ్యులు తదితర అధికారులు పాల్గొన్నారు.