తివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'అల.. వైకుంఠపురములో'. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు సినీ అభిమానుల నుంచి విశేష స్పందని వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించి నాలుగో సాంగ్‌ టీజర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. 'బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టూకుంటివే జిందగికే అట్టబొమ్మై జంటకట్టూకుంటివే'అంటూ సాగే మెలోడీ సాంగ్‌ టీజర్‌ ఆడియన్స్‌ను మెస్మరైజ్‌ చేస్తోంది. రామజోగయ్యశాస్త్రి లిరిక్స్‌ అందించగా.. అర్మాన్‌ మాలిక్‌ ఆలపించాడు. ప్రస్తుతం ఈ పాట సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీంతో ఈ సాంగ్‌ టీజర్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
ఇక 'బుట్టబొమ్మ'పూర్తి సాంగ్‌ను ఈ నెల24 విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన 'జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి' వంటి సూపర్‌ హిట్‌ సినిమా అనంరతం వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టు ఇప్పటికే విడుదలైన మూడు సాంగ్స్‌ రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఇక గీతా ఆర్ట్స్, హారికా హాసినీ క్రియేషన్స్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. టబు, రాజేంద్రప్రసాద్, జయరామ్, నివేదా పేతురాజ్, సుశాంత్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి థమన్‌ సంగీతమందిస్తున్నాడు.