- అడిషనల్ కమిషనర్ గోపి

నూతనంగా ప్రవేశపెట్టిన మొబైల్ యాప్ ద్వారా ప్రతీ ఇంట్లో కుటుంబ సభ్యులందరి పూర్తి వివరాలను నమోదు చేసేందుకు అవకాశముందని నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ గోపి పేర్కొన్నారు. మొబైల్ యాప్ నిర్వహణపై వార్డు అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శులకు అవగాహనా సదస్సును సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ మాట్లాడుతూ వార్డు వలంటీరు పరిధిలోని ఆయా ఇండ్లలో మొబైల్ యాప్ ను వినియోగించి కుటుంబ సర్వే చేపడతారని, సర్వే ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు, పేర్లలో అక్షర దోషాలు వంటి వివిధ అంశాలను నమోదు చేస్తారని తెలిపారు. నగర పాలక సంస్థ ద్వారా మొత్తం మూడు వేల మొబైళ్లను ఇప్పటివరకు వార్డు వలంటీర్లకు అందజేసి అన్ని డివిజనుల్లో సర్వే కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. మొబైల్ యాప్ ద్వారా వార్డు వలంటీర్లు, వార్డు కార్యదర్శుల దైనందిన హాజరు నమోదు కూడా అమలు చేయనున్నామని అడిషనల్ కమిషనర్ వివరించారు.