- ప్రతీ 6 డివిజన్లకు ఒక రిటర్నింగ్ అధికారి కేటాయింపు

- కమిషనర్ పివివిస్ మూర్తి

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నగర పాలక సంస్థ పరిధిలోని 54 డివిజన్లలో చేపట్టిన పునర్విభజన ప్రక్రియలో సవరణలను సూచిస్తూ 22 ఫిర్యాదులు/ సలహాలు అందాయని, టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది పర్యవేక్షణలో క్షేత్రస్థాయి విచారణ చేపట్టి వాటికి పరిష్కారాలు అందిస్తున్నామని కమిషనర్ పివివిస్ మూర్తి ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నగర పాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో కమిషనర్ మాట్లాడారు. కమిషనర్ & మున్సిపల్ డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వారి ఆదేశాలకు అనుగుణంగా నగర పాలక సంస్థ పరిధిని 54 డివిజన్లుగా విభజించి, 9 క్లస్టరు విభాగాలుగా, 424 పోలింగ్ స్టేషన్లతో కూడిన జాబితాను విడుదల చేశామని తెలిపారు. ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల జాబితాను రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉంచామని, నగర పాలక సంస్థ వెబ్ సైట్ ద్వారా కూడా వివరాల నమోదును ఓటర్లు పరిశీలించుకోగలరని కమిషనర్ సూచించారు. మొత్తం 54 డివిజన్లలో 2,33,767 మంది పురుష ఓటర్లు, 2,44,374 మంది స్త్రీ ఓటర్లు, 77 మంది ఇతరులుగా మొత్తం 4,78,218 ఓటర్ల సంఖ్యను తుదిదశ జాబితాగా విడుదల చేశామని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రతీ 6 డివిజన్లకు ఒక రిటర్నింగ్ అధికారిని కేటాయించామని, ఎన్నికల నిర్వహణలో ఆయా పరిధిలోని డివిజన్లకు సంబంధించి అన్ని ఫిర్యాదులు/సలహాలను అధికారి దృష్టికి తీసుకెళ్లాలని కమిషనర్ సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అనంతరం నిర్వహణా ప్రక్రియను పూర్తిస్థాయిలో విజయవంతం చేసేందుకు సిబ్బంది సన్నద్ధంగా ఉన్నామని కమిషనర్ వివరించారు.