2021 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

ధ్వజారోహణంతో శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ప్రారంభం


           శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు గురువారం సాయంత్రం 5.10 నుండి 5.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభమయ్యాయి.

          శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేద‌మంత్రోచ్ఛార‌ణ‌ మధ్య మంగళవాయిద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేశారు. శ్రీ వాసుదేవ బ‌ట్టాచార్యులు కంక‌ణ‌భ‌ట్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను, స‌ప్త‌మ‌రుత్తులను (దేవ‌తాపురుషులు), రుషిగ‌ణాన్ని, స‌క‌ల ప్రాణికోటిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ గ‌రుడాళ్వార్ ధ్వ‌జ‌స్తంభాన్ని అధిరోహిస్తార‌ని ప్రాశస్త్యం.

          విశ్వ‌మంతా గ‌రుడుడు వ్యాపించి ఉంటారు. ఆయ‌న్ను శ్రీ‌నివాసుడు వాహ‌నంగా చేసుకోవ‌డంతో స‌ర్వాంత‌ర్యామిగా స్వామివారు కీర్తించ‌బ‌డుతున్నారు. కాగా, ధ్వ‌జ‌ప‌టంపై గ‌రుడునితోపాటు సూర్య‌చంద్రులకు కూడా స్థానం క‌ల్పించ‌డం సంప్ర‌దాయం. ఈ సంద‌ర్భంగా పెస‌ర‌ప‌ప్పు అన్నం (పొంగ‌లి) ప్ర‌సాద వినియోగం జ‌రిగింది. ఈ ప్ర‌సాదం స్వీక‌రించిన వారికి సంతాన ప్రాప్తి, దీర్ఘాయుష్షు, సిరిసంప‌ద‌లు స‌మ‌కూరుతాయ‌ని విశ్వాసం. అదేవిధంగా, ధ్వ‌జ‌స్తంభానికి క‌ట్టిన ద‌ర్భ అమృత‌త్వానికి ప్ర‌తీక‌. పంచ‌భూతాలు, స‌ప్త‌మ‌రుత్తులు క‌లిపి 12 మంది దీనికి అధిష్టాన దేవ‌త‌లు. ఇది స‌క‌లదోషాల‌ను హ‌రిస్తుంది. ద‌ర్భ‌ను కోసేట‌ప్పుడు, కైంకర్యాల్లో వినియోగించేట‌పుడు ధ‌న్వంత‌రి మంత్ర పారాయ‌ణం చేస్తారు. ధ్వ‌జారోహ‌ణం అనంత‌రం తిరుమ‌ల‌రాయ మండ‌పంలో ఆస్థానం చేప‌ట్టారు.

         ధ్వ‌జారోహ‌ణ ఘ‌ట్టానికి ముందు సాయంత్రం 3 నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఊరేగించారు.

       ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ఛైర్మ‌న్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి దంప‌తులు, ఈవో డాక్ట‌ర్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు శ్రీ‌మ‌తి ప్ర‌శాంతి రెడ్డి, శ్రీ రాంభూపాల్ రెడ్డి, శ్రీ‌మ‌తి మ‌ల్లిశ్వ‌రి, శ్రీ మారుతి ప్ర‌సాద్, శ్రీ మొరంశెట్టి రాములు, డా.శంక‌ర్, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి దంప‌తులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.